మునుగోడు వార్‌: మాకు పోటీ చేసే పరిస్థితి లేదు.. బీజేపీని ఓడించే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉంది: సీపీఐ చాడ

20 Aug, 2022 13:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదని, భవిష్యత్తులోనూ టీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ముఖంగా ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. 

బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో పని చేస్తాం అని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారని, అందుకే సీపీఐ నేతలు వెళ్తున్నారని తెలిపారు. 

అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని చాడ గుర్తు చేశారు. 

కాంగ్రెస్‌పై విమర్శ
టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సమయంలోనే.. కాంగ్రెస్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, సీపీఐని ఇబ్బంది పెట్టింది. మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా కాంగ్రెస్‌ పోటీ చేసింది. ఉత్తమ్‌ కుమార్‌ ఇబ్బంది పెట్టారు అని చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రెస్‌మీట్‌లో సీపీఐ నారాయణ సైతం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మునుగోడులో కాంగ్రెస్‌.. ప్రజాస్వామ్యానికి పాదాభివందనం

మరిన్ని వార్తలు