సీఎంతో రాజకీయాలు చర్చించలేదు: చాడ

13 Sep, 2020 03:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో తాను సమావేశమైన సందర్భంగా రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం రెవెన్యూ బిల్లుపైనే చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. రెవెన్యూ బిల్లుపై గతంలో సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్, టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడైన సూచనలతో పాటు, తమ పార్టీ అభిప్రాయాలను ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. శనివారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకురాలు పశ్య పద్మతో కలిసి చాడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ ఆధ్వర్యంలో అనేక రౌండ్‌ సమావేశాలు నిర్వహించడమే కాకుండా భూమి, రెవెన్యూ అంశాలపై సీఎంకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

సీఎం తనకు స్వయంగా ఫోన్‌ చేసి రెవెన్యూ బిల్లుపై చర్చించేందుకు ఆహ్వానించారని సమగ్ర భూ సర్వే చేసి తప్పుల్లేకుండా సర్వే, రికార్డులను సరి చేయాలని తాము సూచించినట్లు వెల్లడించారు. తన స్వగ్రామం రేకొండలో 50–60 ఏళ్లుగా దళితులు, బీసీలు సాదాబైనామాపై భూములు తీసుకున్నా ఇప్పటికీ పట్టాలు రాలేదని సీఎం దృష్టికి తెచ్చామని, దీంతో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఫోన్‌లో ఆదేశించారని చెప్పారు. కాగా, మఖ్దూం భవన్‌ రూ.24 లక్షల ఆస్తి పన్ను కట్టాలని జీహెచ్‌ఎంసీ నోటీసు ఇచ్చిందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే అధికారులతో మాట్లాడి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆదేశించారన్నారు. తర్వలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు