వామపక్ష ఐక్యతే తక్షణ కర్తవ్యం

16 Oct, 2022 04:06 IST|Sakshi
విజయవాడలో జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభల్లో సంఘీభావం తెలుపుతున్న నాయకులు

సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఉద్ఘాటన

సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో ప్రతినిధుల సభ ప్రారంభం

సాక్షి, అమరావతి: దేశానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ వంటి విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం తీవ్రమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతే తక్షణ కర్తవ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం గురుదాస్‌ దాస్‌గుప్తా నగర్‌(ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలు)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ‘విజయవాడలో జరుగుతున్న జాతీయ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు, భారతదేశంలోని వామపక్ష పార్టీల నాయకులు, దేశం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావడం మన ఐక్యతను చాటుతోంది. దేశంలోనే మూడోసారి సీపీఐ జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం విజయవాడ కావడం గర్వకారణం.

అటువంటి మహత్తర గడ్డపై జరుగుతున్న మహాసభలు. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను సాధించేందుకు వేదికగా నిలుస్తాయని భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం, మత ఛాందసవాదం, విద్వేషం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌ భావజాలంతో అంతర్జాతీయంగా లోతైన బంధాలను పెంపొందించుకోవడం ద్వారా మానవాళికి మంచి భవిష్యత్‌ కోసం ముందుకు సాగుదాం’ అని పిలుపునిచ్చారు.

మెరుగైన భారతదేశం కోసం ముందుకు సాగుదాం..
సీపీఐ జాతీయ మహాసభలకు సౌహార్థ్ర ప్రతినిధులుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు దేవరాజన్‌ హాజరై సందేశాలు ఇచ్చారు. ఏచూరి మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు మేలు చేసే మెరుగైన భారతదేశం కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తుల ఫాసిస్ట్‌ చర్యలను తిప్పికొట్టేందుకు కార్మికులు, రైతులు, కూలీలను సమన్వయం చేసుకుని ఐక్య ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక విపత్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు శక్తివంతమైన, లోతైన ప్రజాస్వామ్య పునాదుల ఆధారంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు.

దేవరాజన్‌ మాట్లాడుతూ దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల పునరేకీకరణ బాధ్యతను సీపీఐ, సీపీఎం తీసుకోవాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆహ్వాన సంఘం తరఫున ప్రతినిధులకు స్వాగతం పలికి సందేశం ఇచ్చారు.

సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నేతలు పి.మధు, వి.శ్రీనివాసరావు, వివిధ రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని సురవరం సుధాకర్‌రెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాన్ని సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు