బీజేపీకి మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్‌ 

28 Aug, 2022 05:27 IST|Sakshi
పార్టీకి వచ్చిన విరాళంతో సీపీఐ నేతలు

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్ట్‌ సంస్థ

అదానీ, అంబానీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు

సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా

సాక్షి, విశాఖపట్నం: మైనార్టీలు, కమ్యూనిస్టులే టార్గెట్‌గా బీజేపీ పని చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. విశాఖలో జరుగుతున్న సీపీఐ 27వ రాష్ట్ర మహాసభల్లో శనివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్ట్‌ సంస్థ అని, బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో కష్టాలు, బాధలను అధిగమించే పాలన సోషలిజంతోనే సాధ్యమన్న భావన ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ అనేక మందిలో ఉందని చెప్పారు.

అదానీ, అంబానీలను అందలమెక్కిస్తున్నారని, వారు దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. భారత్‌లో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దేశంలోనూ శ్రీలంక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ అంతర్గత సమస్యలతో సతమతమవుతుండటం వల్ల నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా లెఫ్టిస్టుల వైపు కాకుండా రైటిస్టుల పక్షానే ఉంటున్నారని విమర్శించారు.

దేశ సమగ్రత, అభివృద్ధి కోసం 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్షాలు, బీజేపీ యేతర పార్టీలు ఉద్యమించాలని రాజా పిలుపునిచ్చారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా, సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.సాంబశివరావు, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజు, సీపీఐ ఎంఎల్‌ (లిబరేషన్‌) రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు ఎస్‌.గోవిందరాజులు, సీపీఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకుడు గణేష్‌పాండా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, 26 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు