‘మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదు’

9 Nov, 2022 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలపాలు చేసిన ప్రధాని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మోదీకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు.  

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిటిష్‌ కాలం నాటి గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ నెల 12న మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సింగరేణి జిల్లాల్లో 10వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడతా మని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనాసిద్ధమేనని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సహా ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. మోదీకి తెలంగాణ అంటేనే కోప మని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపుతున్నారని దుయ్యబట్టారు. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలనే కనీస మర్యాద, గౌరవం కూడా ప్రధానికి లేదన్నారు. తెలంగాణ మంత్రులను తన ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటు న్నానని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు.

త్వరలోనే రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామ న్నారు. గవర్నర్‌ తమిళిసై గవర్నరా? లేదా బీజేపీ కార్యకర్తనా తేల్చుకోవాలన్నారు. 8 బిల్లుల్లో కొన్ని మంచి బిల్లులు కూడా ఉన్నా యని, ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వెనక్కి పంపించాలని, కానీ మంత్రులు వచ్చి రాయబారాలు జరిపితేనే, లొంగిపోతేనే ఆమోదిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు