చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సురవరం

12 Sep, 2020 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాడు నిజాం నవాబుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటం గా బీజేపీ వక్రీకరించి చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధమని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. నిజాం నవాబు, దేశ్‌ముఖ్‌లతో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెజారిటీ ముస్లింలు పాల్గొన్నారని, జిల్లాల్లో సైతం ముస్లింలు కమ్యూనిస్టు పార్టీలో చేరి నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 73వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ ఆధ్వ ర్యంలో ఆన్‌లైన్‌లో బహిరంగసభ జరిగింది. ఈ సభలో సురవరం మాట్లాడుతూ నాటి పోరాటంలో నిజాం వెనుక ముస్లింలు ఉన్నారంటూ బీజేపీ చరిత్రకు వక్రభాష్యం చెబుతోందని ధ్వజమెత్తారు.

ఈ పోరాటంలో ఎవరూ ఎవరినీ మతం పేరుతో చంపలేదని, రాచరిక, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం జరిగిందని అన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో దొడ్డి కొమురయ్య హత్య కీలక మలుపు అని, దీంతో ఆయు ధాలు కలిగిన శత్రువుపై పోరాడేందుకు సాయుధ పోరా టమే మార్గమని, 1947 సెప్టెంబర్‌ 11న రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియొద్దీన్‌ చారిత్రక రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలి పారు. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం సంస్థానం భారత్‌లో విలీనమయ్యాక భూస్వాములు తిరిగి గ్రామాల్లోకి వచ్చి భూములులాక్కునే పరిస్థితుల్లో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కొనసాగించాల్సి వచ్చిందని అన్నారు. 

సాయుధ పోరాటాన్ని స్మరించుకుందాం: నారాయణ 
మహత్తర చరిత్ర కలిగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి భవిష్యత్‌ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ పోరాటాన్ని స్మరించుకోవాలని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ అన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహియొద్దీన్‌ విగ్రహానికి సీపీఐ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సాధనలో సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17ను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని హామీ ఇచ్చారని, కానీ ఆచరణలో అమలు చేయకుండా ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నేతలు ఈటీ నరసింహ, కూనంనేని సాంబశివరావు, బీఎస్‌ బోస్, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
ట్యాంక్‌బండ్‌పై మఖ్దూం మొహియొద్దీన్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా వస్తున్న సీపీఐ నేతలు

మరిన్ని వార్తలు