మత తత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ

19 Jan, 2022 04:58 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

తిరుపతి కల్చరల్‌: లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ మత ఛాందసవాదాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో మంగళవారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి–వక్రీకరణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ.. గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదన్నారు.

హిందూ తత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం, మైనారిటీ, బౌద్ధులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీఎల్‌ నరసింహులు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు హిందూ తత్వాన్ని భుజానికి ఎత్తుకుని ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను మార్చివేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సదస్సులో ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు