రామకృష్ణ రూటే సెపరేటు.. నిజాలు తెలిసి నాలుక మడత

15 Dec, 2022 21:19 IST|Sakshi

కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాడతారనే పేరుండేది. కాని ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రకటనలు అనుమానాలకు తావిస్తోంది.

సిద్ధాంతాలకు తిలోదకాలు
భారత కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణ.. పాతికేళ్ళ క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కొంతకాలంగా రామకృష్ణ అనుసరిస్తున్న తీరుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని సీపీఐ వర్గాలే చెబుతున్నాయి. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా పోరాడే పార్టీగా తమ పార్టీ సీపీఐకి బ్రాండ్‌ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణపై సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రామకృష్ణ.  అనంతపురం కేంద్రంగా గత కొన్ని రోజులనుంచి జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

జాకీపై పచ్చ పడగ
అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జాకీ కంపెనీ ముందుకొచ్చింది. 129 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనంతపురంరాప్తాడు మధ్య 27 ఎకరాల భూమిని సేకరించి కంపెనీకి ఇచ్చింది. 2018లోపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ జాకీ కంపెనీ రాప్తాడులో ఏర్పాటు కాలేదు.

రాప్తాడుకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ఈ కంపెనీని ఇరవై కోట్ల రూపాయల కమిషన్లు అడిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఆ రోజున సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతల అవినీతి గురించి ప్రశ్నించలేదు. అర్థాంతరంగా పనులు నిలిపివేసి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమపై ఆయన ఏ మాత్రం స్పందించలేదు.

నిజాలు తెలిసి నాలుక మడత
నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జాకీ అంశం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేయటం వల్లే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఆరోపించారు. దీన్నే ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది.  తెలుగుదేశం నాయకుల ఆరోపణలకు మద్దతుగా రంగంలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించారు.

ఎమ్మెల్యే తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ రాలేదంటూ టీడీపీ ఆరోపణలను రామకృష్ణ కూడా వల్లె వేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల వల్లే జాకీ కంపెనీ వెళ్లిపోతే..అప్పుడు సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ మాజీ మంత్రి పరిటాల సునీతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యే తోపుదుర్తిపైనా ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో టాక్ నడుస్తోంది.

ఏమైంది చిత్తశుద్ధి?
ఆనాడు మౌనంగా ఉండి నేడు హడావిడి చేయడానికి కారణం టీడీపీకి మద్దతుగా నిలవడమేనని కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ నేతల అవినీతి, జాకీ పరిశ్రమ తరలిపోవటంపై నిలదీసి ఉండోచ్చని అంటున్నారు. హింసా రాజకీయాలు అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని వెనకేసుకు రావటం ద్వారా సీపీఐ నేత రామకృష్ణ కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీశారంటూ జిల్లాలోని వామపక్ష వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు