‘కేంద్ర’ విద్యుత్‌ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించండి

25 Jul, 2021 04:03 IST|Sakshi

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఎం విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్‌ పంపిణీ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి  సీపీఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ‘విద్యుత్‌ పంపిణీ పునరుద్ధరణ పథకాన్ని’ తిరస్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్‌ అంశాన్ని కేంద్రం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం ఓ  ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యుత్‌ పంపిణీ రంగాన్ని ప్రైవేటీకరించి, ఫ్రాంచైజీల పేరుతో  దళారులను ప్రవేశపెట్టడం ఈ పథకం లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించే చర్యలను ఆపాలని మధు డిమాండ్‌ చేశారు.  అలాగే చట్టవిరుద్ధంగా పౌరులు, ప్రజాప్రతినిధులపై నిఘా పెడుతున్న ఇజ్రాయల్‌ స్పై సాఫ్ట్‌వేర్‌ ‘పెగాసెస్‌’ను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని  మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పౌరులపై నిఘా ఏ రూపంలో ఉన్నా వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.   

మరిన్ని వార్తలు