కేంద్ర విధానాలపై పోరాటం ఉధృతం చేయాలి 

6 Dec, 2021 05:11 IST|Sakshi
సమావేశంలో ప్రసంగిస్తున్న రాఘవులు

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. సీపీఎం గ్రేటర్‌ విశాఖ కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో ప్రస్తుత రాజకీయ–ఆర్థిక పరిస్థితులు–కర్తవ్యం అంశంపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వల్ల దేశంలో పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరిగిందని, విద్యా వ్యవస్థ కూడా దారుణంగా దెబ్బతిందన్నారు. మోడీ ప్రభుత్వం కరోనా వైరస్‌ను సాకుగా చూపి అవలంభించిన ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల వల్ల దేశంలో 10 శాతానికి పైగా నిరుద్యోగం పెరిగిందని దుయ్యబట్టారు.

కొత్తగా నేషనల్‌ మోనటైజేషన్‌ పేరిట ప్రజా ఆస్తులను 40 ఏళ్ల పాటు ప్రైవేట్‌సంస్థలకు అప్పగించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థలు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, ప్రభుత్వ భూములను ప్రైవేట్‌కి కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, 78 వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బీ.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.నరసింగరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, అధికసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు