సోషలిజమే ప్రత్యామ్నాయం

2 May, 2022 03:41 IST|Sakshi
మే డే సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేస్తున్న సీపీఎం సీనియర్‌ నేత పి.మధు

సీపీఎం సీనియర్‌ నేత మధు ఉద్ఘాటన

వాడవాడలా ఘనంగా మేడే వేడుకలు

సాక్షి, అమరావతి: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే సిద్ధాంత బలం కమ్యూనిస్టులు, వామపక్షాలకే ఉందని సీపీఎం సీనియర్‌ నేత పి.మధు అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు ప్రత్యామ్నాయం సోషలిజమే తప్ప మరొకటి కాదన్నారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం (కాట్రగడ్డ శ్రీనివాసరావు భవన్‌)లో ఆదివారం మేడే ఉత్సవాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మధు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కేంద్రంలోని బీజేపీకి వంత పాడుతున్నాయని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందని, పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేసిందన్నారు.

విజయవాడలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావులు మాట్లాడుతూ.. మేడే స్ఫూర్తితో లేబర్‌ కోడ్ల రద్దుకు, ప్రభుత్వ రంగ పరిరక్షణకు పోరాడుదామని కార్మికులకు పిలుపునిచ్చారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయం (దాసరి నాగభూషణరావు భవన్‌) వద్ద నిర్వహించిన సభలో సీపీఐ నేత రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, దోనేపూడి శంకర్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా, రాష్ట్రంలో వాడవాడలా మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి తదితర పట్టణాల్లోనూ, జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోనూ కార్మికులు ఎర్ర జెండాలు చేతబట్టి భారీ ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు