బలపడి.. తలపడదాం..!

24 Jan, 2022 04:54 IST|Sakshi
సీపీఎం మహాసభల్లో వెంకట్, తమ్మినేని, బీవీ రాఘవులు, ప్రకాశ్‌కారత్‌

సీతారాం ఏచూరి పిలుపు 

బీజేపీకి వ్యతిరేకంగా విశాల ఐక్యసంఘటన 

ముందుగా వామపక్షాలు బలపడాలి 

ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకొని పోవాలి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఫాసిస్టు హిందూ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పడాల్సిన అవసరం ఉంది..’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యమని పేర్కొన్నారు. ముందుగా వామ పక్షాలు మరింత బలపడి, ప్రజాస్వామిక, లౌకికశక్తులను కలుపుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ కేంద్రంగా ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్ట్‌ అజెండాను అమలు చేయడమే బీజేపీ లక్ష్యమంటూ తమ పార్టీ ఏనాడో హెచ్చరించిందని ఆయన గుర్తుచేశారు. అదే ఈ రోజు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా త్వరలోనే ‘దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం’అంటూ బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అవినీతి ‘చట్టబద్ధమైన రాజకీయ అవినీతి’గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పౌర, ప్రజాస్వామిక హక్కులపై పెద్దయెత్తున దాడి జరుగుతోందని చెప్పారు. అయితే ఇదే సమయంలో బీజేపీ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు బలపడుతున్నాయని చెప్పారు. రైతాంగ ఉద్యమాన్ని ఆయన ఉదహరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు.  

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న టీఆర్‌ఎస్‌: తమ్మినేని 
కేంద్రంలోని బీజేపీ మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయంగా లబ్ధి పొందుతుంటే, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రాంతీయ విద్వేషా లు రెచ్చగొడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పడే వాగ్దానాలను విస్మరించి, ఎన్నికల్లో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు ప్రధానంగా ప్రజాస్వామిక, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు వార్తలను ఆయన ఖండించారు.

పునరేకీకరణకు కృషి జరగాలి: చాడ  
సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేప ట్టే పోరాటాల్లో సీపీఐ, సీపీఎంల మధ్య సారూప్యత ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు తమ ఐక్యతకే కాకుండా పునరేకీకరణకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఈ మహాసభల్లో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు  ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పలు వురు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు