గోమాత అంటూనే పాలు, పెరుగుపై జీఎస్టీ వేస్తారా?

18 Sep, 2022 01:42 IST|Sakshi

మోదీ ప్రభుత్వానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్‌ సూటిప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: గోమాత అంటూనే పాలు, పెరుగుపై మోదీ ప్రభుత్వం జీఎస్టీ వేసిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఎ.విజయరాఘవన్‌ విమర్శించారు. బియ్యం, గోధుమలతోపాటు ఇతర ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ విధించి ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను శనివారం సీపీఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని వీరనారి ఐలమ్మ విగ్రహానికి విజయ రాఘవన్‌తోపాటు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై ఉన్న మఖ్దూం మొహియుద్దీన్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అక్కడ విజయరాఘవన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

సెప్టెంబర్‌ 17పై బీజేపీ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. నిజాంకు వ్యతిరేకంగా హిందూ– ముస్లింల మధ్య పోరాటం సాగిందంటూ చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మాంత్రికుడిగా మారారని, బడా పారిశ్రామికవేత్తలైన అదానీ, అంబానీల కోసమే బీజేపీ నేతలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, రాష్ట్రాల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన సూచించారు. కేరళలోని 96 శాతం కుటుంబాల చేతిలో మొత్తం భూమి ఉందని, అక్కడ పాలిస్తున్న వామపక్షాలే దేశానికే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు