ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం

28 Oct, 2020 11:40 IST|Sakshi

రాజకీయపార్టీలతో విడివిడిగా నిమ్మగడ్డ రమేష్ సమావేశం

ప్రభుత్వంతో చర్చించాలి: సీపీఎం, సీపీఐ

తాజా నోటిఫికేషన్‌ విడుదల చేయాలి: బీజేపీ

ఈసీ తీరు ఆశ్చర్యకరం: మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పార్టీ పేర్కొంది. వివాదాలకు తావులేకుండా వ్యవహరించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వంతో సంప్రదించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కరోనా పేరిట వాయిదా వేయడంతో మధ్యలో నిలిచిపోయిన స్థానిక ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బుధవారం వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. (చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీరుపై విస్మయం)

ఈ నేపథ్యంలో.. సీపీఎం తన అభిప్రాయాలను వెల్లడిస్తూ..‘‘గతంలో కరోనా ఉందని ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. వరదలు వచ్చాయి. వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. స్కూళ్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇటువంటి సమయంలో ఈసీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’’ అని పేర్కొంది. (చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు అభిప్రాయ సేకరణ)

ఇక సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కేసుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అభిప్రాయాన్ని.. ఈసీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో ఈసీ చర్చించాలని అభిప్రాయపడ్డారు. కాగా గత ఎన్నికలను రద్దు చేయాలని, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ పేర్కొంది. ఇక బీఎస్పీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గత నోటిఫికేషన్ రద్దు చేయాలని ఈసీకి తెలిపామని, వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ సూచించింది. గతంలో కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు కరోనా ప్రభావం ఉందా, లేదా అనేది ఈసీ చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని  కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

ఈసీ సమావేశం ఆశ్చర్యకరంగా ఉంది
వ్యక్తిగతంగా, ఓ పార్టీ వ్యక్తిగా ఈసీ సమావేశం ఆశ్చర్యాన్ని కలిగించిందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితి ఏం మారిందని ఈసీ సమావేశం పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా, ఈసీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు.. నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని శత్రువుగా చూస్తున్నారా.. అసలు ఈ సమావేశం వెనుక ఉన్న రహస్య అజెండా ఏంటి’’ అని ప్రశ్నించారు. ఓ ప్రైవేటు హోటల్‌లో నిమ్మగడ్డ జరిపిన మంతనాలు ప్రజలంతా చూశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు పూర్తిగా న్యాయం చేస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు