కరెక్ట్‌ కాదు.. కామ్రేడ్‌!

11 Dec, 2023 04:44 IST|Sakshi

ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి 

ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంపై విమర్శలు 

కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోకపోవడంపైనా ఆగ్రహం 

ఘోర పరాజయానికి బాధ్యులపై చర్యలుంటాయన్న వాదనలు 

12, 13, 14 తేదీల్లో పార్టీ సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయంపై సీపీఎంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోకుండా చివరి నిమిషం వరకు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం... అనంతరం ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోవడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం చేకూరేదిగా ఉందన్న ఆరోపణలను రాష్ట్ర అగ్రస్థాయి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని పార్టీ అంతర్గత విచారణలో తేలింది.

పార్టీకి చెందిన యువ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు స్పష్టమైందని అంటున్నారు. అందువల్లే ఎన్నడూలేని స్థాయిలో పార్టీ ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందంటున్నారు. మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం వంటి స్థానాల్లోనూ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేvస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ను గెలిపించేలా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 

సీపీఐ మాదిరిగా ఎందుకు వ్యవహరించలేదు? 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు పొడవకపోవడంతో కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చివరకు కాంగ్రెస్‌తోనూ సర్దుబాటు కుదరలేదు. మిర్యాలగూడ కేటాయించి, అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్‌ విధించిన షరతును సీపీఎం తోసిపుచ్చింది. దీంతో ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ కొత్తగూడెం సీటు, రెండు ఎమ్మెల్సీలకు ఒప్పుకొని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ప్రయోజనం పొందగలిగింది. ఇలా ఎందుకు చేయలేదన్న చర్చ సీపీఎంలో కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. 

రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తప్పుడు నిర్ణయాలే? 
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటోందని రాష్ట్రస్థాయి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2014లోనూ సీపీఎం భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేసి విఫలమైంది.

బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు విఫల ప్రయోగమని పార్టీ కేంద్ర కమిటీ చీవాట్లు పెట్టిందని అంటున్నారు. ఇక ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవడంలో విఫలమై మరోసారి పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఒక నాయకుడు విశ్లేvంచారు. ‘పార్టీ సిద్ధాంతం గొప్పది. మార్క్సిజం అజేయమే. కానీ ఆ సిద్ధాంతాన్ని సరిగా అమలుచేయకపోవడం వల్ల ప్రజల్లో సీపీఎం పలుచన అవుతోంది. ఇది కొందరు వ్యక్తులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే’నని ఆ నాయకుడు అన్నారు. 

ఆ మూడురోజుల్లో చర్చ 
పార్టీ ఓటమి, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ నెల 12వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, 13, 14 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీపీఎం నిర్ణయించింది. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులపై చర్యలు తప్పవని అంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా సరైన వ్యూహాన్ని అనుసరించి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం కార్యకర్తలు కోరుకుంటున్నారు.  

>
మరిన్ని వార్తలు