రణరంగంగా క్యూబా.. విధ్వంసకాండ! కుట్ర కోణం?

13 Jul, 2021 11:46 IST|Sakshi

Cuba Protests దశాబ్దాలుగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న క్యూబాలో కనివిని ఎరుగని రీతిలో జనాగ్రహం పెల్లుబిక్కింది. రోడ్డెక్కిన వేల మంది ప్రజలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన గళం విప్పుతున్నారు. నియంతృత్వ పోకడల ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని, అధ్యక్షుడు మిగ్యుయెల్‌ దిజాయ్‌-కనెల్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ తిరుగుబాటు వెనుక కుట్ర కోణం ఉందని క్యూబా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

హవానా: కరేబియన్‌ ద్వీప దేశం క్యూబాలో ఈ స్థాయి ప్రభుత్వవ్యతిరేకత కనిపించడం ఇదే తొలిసారి. ఆర్థిక సంక్షోభం వల్లే జనాల్లో ఆగ్రహం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరెంట్‌ కోతలు, ఆహార కొరత, కరోనా మందులు-వ్యాక్సిన్‌ల కొరత.. వీటికి తోడు అమెరికా ఆంక్షల పర్వం కూడా క్యూబా ప్రజల్లో సొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయి.

అధ్యక్షుడు Miguel Díaz-Canel రాజీనామాకు డిమాండ్‌ చేసేలా చేశాయి. ‘మా స్వేచ్ఛ మాక్కావాలి’ అంటూ వేల మంది రాజధాని హవానాకు చేరి ప్రదర్శనలు చేపడుతున్నారు. పోలీసులు వాళ్లను అదుపు చేసే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కర్రలతో ఎదురు దాడులకు పాల్పడడమే కాకుండా.. ప్రజా ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు నిరసనకారులు. 

అణిచివేత
దశాబ్దాల కమ్యూనిస్టు పాలనలో ఇంత తీవ్ర స్థాయి నిరసనలు హోరెత్తడం ఇదే తొలిసారి. హవానాతో పాటు చాలాచోట్ల పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో మిలిటరీ, పోలీసుల సాయంతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది క్యూబా ప్రభుత్వం. ఇప్పటికే పదుల సంఖ్యలో నిరసనకారుల్ని అరెస్ట్‌ చేశారు. మరికొందరికి గాయలయ్యాయి. క్యూబాలో 2018లో ఇంటర్నెట్‌ అడుగుపెట్టగా.. ప్రస్తుతం ప్రజా తిరుగుబాటు ప్రభావంతో సోషల్‌ మీడియాలో కుప్పలుగా పోస్టులు కనిపిస్తున్నాయి.

దీంతో అక్కడి ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను కట్‌ చేసింది. మరోవైపు క్యూబా ప్రజాగ్రహంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. క్యూబా ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న తిరుగుబాటు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అభివర్ణించాడు. క్యూబా ప్రజలకు తమ మద్ధతు ఉంటుందని ఆయన ప్రకటించారు. ‘ముందు వాళ్ల డిమాండ్లు ఏంటో వినండి.. అణచివేతను ఆపి పేదరికాన్ని ఎలా రూపుమాపాలో దృష్టిపెట్టండి. ప్రజలపై కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అంటూ క్యూబా ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చారు బైడెన్‌. 

జోక్యం చేసుకుంటే ఊరుకోం
ఇది ముమ్మాటికీ ‘క్యూబన్‌-అమెరికన్‌ మాఫియా’ పనే అని ఆరోపిస్తోంది క్యూబా సర్కార్‌. పెయిడ్‌ ఏజెంట్లను నియమించుకున్న అమెరికా.. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంతో అంతర్జాతీయ సమాజంలో తమను నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని అధ్యక్షుడు మిగ్యుయెల్‌ దిజాయ్‌-కనెల్‌ ఆరోపించాడు. ఇందులో కుట్ర దాగుంది. ప్రజలు సమన్వయం పాటించాలి. శాంతి స్థాపన కోసం పదవిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధం. ఇతరుల జోక్యం లేకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరిద్దాం అని ఆదివారం రాత్రి జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఇదిలా ఉంటే క్యూబా అంతర్గత వ్యవహారంలో ఏ దేశమైనా కలుగజేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని రష్యా, మెక్సికోలు హెచ్చరికలు జారీ చేశాయి. అఫ్‌కోర్స్‌.. పరోక్షంగా ఈ వార్నింగ్‌ అమెరికాకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక శాంతియుతంగా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చి.. వాళ్ల డిమాండ్లపై చర్చలు జరపాలని ఈయూ ఫారిన్‌ పాలసీ ఛీఫ్‌ జోసెఫ్‌ బొర్రెల్‌, క్యూబా ప్రభుత్వాన్ని కోరాడు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు