అక్రమాలు చేసేందుకే 'సీఆర్‌డీఏ'లో సెక్షన్లు

22 Mar, 2021 03:51 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు 

అనకాపల్లి: అమరావతి కోసం దళితవర్గాల అసైన్‌మెంట్‌ భూముల సేకరణ, అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. దళితులకిచ్చిన ప్రభుత్వ భూములను చంద్రబాబు అనుచరులు అక్రమంగా సేకరించి లబ్ధిపొందారని ఆయన ఆరోపించారు. భూముల సేకరణలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నా మంత్రిపై, అధికారులపై కేసులు పెట్టరాదని సీఆర్‌డీఏ చట్టంలో సెక్షన్‌ 146 చేర్చడాన్ని చూస్తే.. అక్రమాలు చేయడానికి ముందే సిద్ధపడినట్లు రుజువైందని చెప్పారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయి పోస్టులో జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారి చెరుకూరి శ్రీధర్‌ను నియమించడం ఒక నేరమని చెప్పారు. శ్రీధర్‌ను ముందుపెట్టుకొని సీఆర్‌డీఏను మంత్రి నారాయణ సొంత ఎస్టేట్‌గా వాడుకున్నారన్నారు.

చంద్రబాబు ప్రతి విచారణకు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గవర్నర్‌ వద్దకుగానీ, ప్రివిలేజ్‌ కమిటీ వద్దకుగానీ వెళ్లకపోవడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. తాను ప్రివిలేజ్‌ కమిటీ పరిధిలోకి రానని ఆయన చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. తర్వాత వాయిదాకు హాజరుకాకపోతే ఆయనపై వారెంట్‌ జారీచేసి అరెస్టు చేసే అధికారం ప్రివిలేజ్‌ కమిటీకి ఉందన్నారు. ఆరు రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయకుండా ఎన్నికల కమిషనర్‌ పారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన ఉత్తరాలను లీకు చేస్తున్నారంటూ గవర్నర్‌ కార్యదర్శిపై ఎన్నికల కమిషనర్‌ ఫిర్యాదు చేయడం సరికాదని చెప్పారు. 

మరిన్ని వార్తలు