వరదల్లో క్షుద్ర రాజకీయాలా?

18 Jul, 2022 04:43 IST|Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌

పిచ్చిచేష్టలు, మాటలతో జోకర్‌ను తలపిస్తున్న పవన్‌కల్యాణ్‌ 

జనసేన కాదది జోకర్‌ సేన

ఇప్పుడు రూ.2,205 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తుండటం ఆయన కళ్లకు కనిపించలేదా?

రోడ్లపై నడిచే పవన్‌కల్యాణ్, లోకేశ్‌ వంటి ప్రతి ఆవారాగాడూ మహానుభావులు కాలేరు

చంద్రబాబును సీఎంను చేయడం కోసమే పవన్‌ తాపత్రయం

వచ్చే ఎన్నికల్లోనూ సీఎం జగన్‌ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు  

సాక్షి, అమరావతి: ‘పిచ్చిమాటలు, చేష్టలు, విమర్శలతో పవన్‌కల్యాణ్‌ జోకర్‌ను తలపిస్తున్నారు. జనసేన కాదది జోకర్‌సేన. ఆపార్టీకి ఒక సిద్ధాంతంగానీ రూపురేఖలుగానీ లేవు..’ అంటూ రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా (రామలింగేశ్వరరావు) విమర్శించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద బాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ, సహకారాలు అందిస్తుంటే.. మండపేట, భీమవరం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మాత్రం క్షుద్ర రాజకీయాలు చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాజకీయం చేస్తే.. శని, ఆదివారాల్లో వారికి కాల్షీట్లు అమ్ముకున్న పవన్‌కల్యాణ్‌ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పార్ట్‌నర్‌ అయిన పవన్‌కల్యాణ్‌ అప్పట్లో రహదారులు గురించి నోరుమెదపలేదని గుర్తుచేశారు.

ఒక రహదారిని నిర్మిస్తే దాని కాలపరిమితి ఎనిమిదేళ్లు ఉంటుందన్నారు. టీడీపీ సర్కార్‌ హయాంలో రహదారుల కోసం అప్పుతెచ్చిన నిధులను చంద్రబాబు దారిమళ్లిస్తే.. ప్రశ్నించకుండా నోట్లో వేలు పెట్టుకున్నావా? అని పవన్‌కల్యాణ్‌ను నిలదీశారు. అప్పట్లో గుంతలమయంగా మారిన రోడ్లను హ్యాష్‌టాగ్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్‌ హయాంలో శిథిలమైన రహదారులు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా భారీవర్షాలు కురవడంతో మరింత దెబ్బతిన్నాయన్నారు.

వాటిని అభివృద్ధి చేయడం కోసం రూ.2,205 కోట్లతో మొదటిదశలో చేపట్టిన పనులు 60 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఇవేవీ కనిపించలేదా? అని పవన్‌కల్యాణ్‌ను నిలదీశారు. వర్షాలు తగ్గగానే ఆగస్టులోగా మిగతా 40 శాతం పనులు పూర్తిచేస్తామన్నారు. రోడ్ల మీద నడిచే ప్రతి ఆవారాగాడు.. పవన్‌కల్యాణ్, లోకేశ్‌ వంటి వారు మహానుభావులు కాలేరని ఎద్దేవా చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలా జనంతో మమేకమవుతూ, భవిష్యత్‌పై వారికి భరోసా కల్పించేలా సాంత్వన చేకూరిస్తేనే మహానుభావులు అవుతారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చొక్కా పట్టుకుంటేనేగానీ కిందకు దిగిరారని పవన్‌కల్యాణ్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో  భీమవరంలోగానీ, గాజువాకలోగానీ ప్రజలు నీ జుట్టు పట్టుకున్నారా? చొక్కా పట్టుకున్నారా? స్పష్టత ఇస్తే బాగుంటుందని సూచించారు.  

కామపిశాచికి ఆప్యాయతలు తెలియవు 
పాదయాత్రలో వృద్ధులు, చిన్నపిల్లలకు సాంత్వన చేకూరుస్తూ.. భవితపై భరోసా ఇస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ వారిపై ఆప్యాయత, అనురాగం చూపారని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. కానీ.. కామపిశాచి పవన్‌కల్యాణ్‌కు ఆ ఆప్యాయతలు, అనురాగాలు తెలియవంటూ మండిపడ్డారు. ‘నువ్వో కామíపిశాచివి. నీ ఆలోచనలన్నీ కామంతోనే ఉంటాయి. నీలాంటి నీచుల కంట పడకుండా రాష్ట్రంలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్త పడుతున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు.

పవన్‌కల్యాణ్‌.. తన బాస్‌ చంద్రబాబును సీఎంను చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో కులాలు, మతాల గురించి పవన్‌కల్యాణ్‌లా మాట్లాడేవారు మరొకరు ఉండరన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను 2024 ఎన్నికలోనూ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ను, ఆయనకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబును మరోసారి తరిమికొట్టడానికి ప్రజలు తహతహలాడుతున్నారని మంత్రి చెప్పారు.   

మరిన్ని వార్తలు