మహిళలను రోడ్డుకు ఈడిస్తే.. లోకేశ్‌ నాలుక చీరేస్తాం

28 Sep, 2022 04:19 IST|Sakshi

కోటనందూరు: గౌరవంగా ఇంట్లో ఉండే మహిళలను రోడ్డుకు ఈడిస్తే లోకేశ్‌ నాలుక చీరేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో మంగళవారం వైఎస్సార్‌ చేయూత మూడోవిడత చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలందరూ సీఎం జగన్‌ను అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా భావిస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మహిళలంతా ఎవరి ఇంట్లో వారు సంతోషంగా ఉండాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. అలాంటి ఈ రాష్ట్రంలో సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతిపై నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో ఐటీడీపీ బృందం అవాకులు, చెవాకులు మాట్లాడుతోందని చెప్పారు. సోషల్‌ మీడియాలో సైతం రకరకాల తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వారి తాబేదార్లయిన ఎల్లో మీడియాలో రోజూ కథనాలు వండి వారుస్తున్నారని చెప్పారు. విషప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంట్లో ఉండే ఆడవాళ్లను రోడ్డుమీదకు లాగి రాజకీయం చేసే సంస్కృతి మన రాష్ట్రంలో ఇప్పటివరకు లేదన్నారు. ఇటువంటి పద్ధతిని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టొద్దని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు ఇంట్లో కూడా మహిళలున్నారని, కావాలనుకుంటే వారిమీద తాము కూడా అవాకులు, చెవాకులు మాట్లాడగలమని, తప్పుడు ప్రచారం చేయగలమని, కానీ.. అది తమ సంస్కృతి కాదని చెప్పారు.

చంద్రబాబు తన కుమారుడికి సభ్యత, సంస్కారం నేరి్పంచి అదుపులో ఉంచుకోవాలని సూచించారు. సీఎం సతీమణి వైఎస్‌ భారతమ్మ మీదే కాకుండా రాష్ట్రంలో ఏ అక్కచెల్లెమ్మ జోలికొచి్చనా నీ కొడుకు నాలుక చీరేస్తామని ఆయన చంద్రబాబును హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు