వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే బాబు పని

29 May, 2021 04:19 IST|Sakshi

ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోక, ప్రభుత్వాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్‌ నాయకుడు దాసరి రాజా మాస్టారు

సాక్షి, గుంటూరు: వ్యవస్థలను మేనేజ్‌ చేయడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పని అని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ కేంద్రం డైరెక్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాజా మాస్టారు విమర్శించారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తప్పులను సరిదిద్దుకోవడం వదిలి ప్రభుత్వాన్ని బలహీనపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు గుంటూరులో శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన అనంతరం చంద్రబాబు తీరులో మార్పు వస్తుందని ఎదురుచూస్తూ వచ్చానన్నారు. అయితే మార్పు రాలేదన్నారు.

గడిచిన రెండు రోజుల్లో నిర్వహించిన వర్చువల్‌ మహానాడు కార్యక్రమం చంద్రబాబును పొగడటం, సీఎం జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమైందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు నగరంలో ఉన్న రెండు మేజర్‌ గ్రంథాలయాలకు మాజీ సీఎంలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల పేర్లు పెట్టాలని ప్రతిపాదన చేస్తే చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గ్రంథాలయానికి రామారావు పేరు పెట్టడానికి విముఖత చూపిన బాబు ఆయన ఫొటోలకు దండలు వేస్తూ, నివాళులు అర్పిస్తూ పార్టీ నాయకులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్యకాలంలో గుంటూరులోని అప్పటి రాష్ట్ర, ప్రస్తుత జిల్లా పార్టీ కార్యాలయం పక్కనే నివసిస్తున్న పేద ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని చేస్తానని తనకు మాటిచ్చి చివరి నిమిషంలో మోసం చేశాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన తాను పార్టీ వీడుతున్నట్టు తెలిపారు. రాజా మాస్టారుతో పాటు గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యర్రగోపు నాగేశ్వరరావు కూడా పార్టీని వీడారు. 

మరిన్ని వార్తలు