ఇది ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది.. బీజేపీలోకి చేరికలపై తరుణ్‌ ఛుగ్‌

7 Aug, 2022 08:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌తో ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వెదిరె శ్రీరాంలతో కలిసి దాసోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ మీడియాతో మాట్లాడారు. ‘బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తాం. చేరికల విషయంలో చాలా పెద్ద జాబితా రెడీగా ఉంది. ఇది ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ముందుంది. పార్టీలో ఎవరినైనా చేర్చుకుంటే పార్టీ అభివృద్ధి కోసమే. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి విముక్తి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌కు బీ టీంగా మారింది. భయపెట్టడం, ప్రలోభపెట్టడం అనేది కేసీఆర్‌ ఫార్ములా. ఇక బీజేపీని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో బీజేపీ ఉనికిని చాటుకుంటోంది. ఇంటెలిజెన్స్‌ సర్వేలు సైతం టీఆర్‌ఎస్‌ వెనకబడిపోయిందని కేసీఆర్‌కు తెలియచేశాయి’అని అన్నారు.  

డబ్బులిచ్చే సంస్కృతి మాది కాదు.. 
‘కాంట్రాక్టులు, డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకొనే సంస్కృతి బీజేపీలో లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కాంట్రాక్టరే. కాంట్రాక్టులు, డబ్బులు ఇవ్వడం అనేది కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ సంస్కృతి. సోనియా, రాహుల్‌ను బండ బూతులు తిట్టినవాళ్లే కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు అయ్యారు. తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యులైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌లాంటి నాయకులు కాంగ్రెస్‌లో ఎందుకు ఇమడలేకపోతున్నారో మొదట ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ భాష హద్దుమీరితే ప్రజలు క్షమించరు. అనుకోకుండా మాట్లాడితే సరిదిద్దుకోవచ్చు.. కానీ కావాలని మాట్లాడితే మాత్రం తప్పు. కేసీఆర్‌ కుటుంబ పరిస్థితి చెల్లని రూపాయిలా మారిపోయింది’అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: కేంద్ర సంస్థల నుంచి  మీ కంపెనీలకు పనులు వచ్చాయా, లేదా? మీ నాటకం ప్రజలకు తెలిసిపోయింది

మరిన్ని వార్తలు