Dasoju Sravan Kumar: కాంగ్రెస్‌కు దాసోజు గుడ్‌బై.. రేవంత్‌ అరాచకం వల్లే అంటూ తీవ్రవ్యాఖ్యలు

5 Aug, 2022 17:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి తన సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని ఒక మాఫియాగా నడిపిస్తున్నారని, కేవలం వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాడుతున్నాడని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలోనే మండిపడ్డారాయన.  

► ‘‘రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవిని ఫ్రాంచైజీలా తెచ్చుకున్నారు. ప్రతి నియోజవర్గంలో ముగ్గురు లేదంటే నలుగురిని ప్రోత్సహిస్తూ సొంత ముఠా తయారు చేసుకుంటున్నారు. ఏదో ప్రైవేట్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా పార్టీని నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కులం, ధనంతోనే పార్టీలో  రాజకీయం నడుస్తోంది. రేవంత్‌ వద్ద ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రకులాల దురహంకారం నడుస్తోంది. సగటు కాంగ్రెస్‌ కార్యకర్తల ఆశలను రేవంత్‌ నీరుగారుస్తున్నారు.

అహంకారపూరిత రాజకీయాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారు. రేవంత్‌ నేతృత్వంలో పార్టీలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నాడు.  ఏఐసీసీ నేతలు సైతం రేవంత్‌ అరాచకాలను అడ్డుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, సునీల్ కనుగలు కుమ్మక్కు అయ్యారు. ఈ ముగ్గురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. సర్వే ల పేరు మీద తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. 

పది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని రాజకీయాల్లోకి వచ్చా. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశా.  అమరవీరుల బలిదానాన్ని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్‌లో చేరా. కానీ, టీఆర్‌ఎస్‌కు ప్రత్యాహ్నాయంగా కాంగ్రెస్‌ ఎదగలేకపోతోంది. సొంత ముఠాతో కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నించే వాళ్లపై ఏఐసీసీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు.  పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేసే మమ్మల్నే అణచివేశారు. ఏడాది కాలంలో నన్ను పార్టీ లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే బాధతో కాంగ్రెస్‌ను వీడుతున్నా అని ప్రకటించారు దాసోజు శ్రవణ్‌.

ఇదీ చదవండి: తూచ్‌.. నేను అలా అనలేదు- బండి సంజయ్‌

మరిన్ని వార్తలు