నా సొంత ఇంటి చేరుకున్న ఫీలింగ్‌ ఉంది.. బీజేపీలో చేరికపై దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యలు

8 Aug, 2022 02:41 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దాసోజు శ్రవణ్‌ ధ్వజం

బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ సమక్షంలో పార్టీలో చేరిక 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని 12 వేల పల్లెల్లో ఒక్కో పల్లెలో 8 నుంచి 12 వరకు బెల్ట్‌షాపులను ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ బెల్టుషాపుల ద్వారా రాష్ట్రాన్ని అనారోగ్య తెలంగాణగా మార్చి, ప్రజల రక్తాన్ని జలగలా పీల్చి ఖజానా నింపుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఇక్కడ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, భిక్షమయ్య గౌడ్‌ సమక్షంలో శ్రవణ్‌కు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శ్రవణ్‌ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానని, చిన్నప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ తనకు అనుబంధం ఉన్నందున, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సుమారు 1,500 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో అవినీతిరహితం, జవాబుదారీతనం, ప్రజాహితం పాలన అనే లక్ష్యాలకు టీఆర్‌ఎస్‌ తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. చీకోటి ప్రవీణ్‌ వంటి వారిని భుజాలపై ఎత్తుకొని ఊరేగుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అధికార మారి్పడి జరగాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్‌ గద్దె దిగాల్సిన చారిత్రక అవసరం ఉందని భావిస్తున్నామని అన్నారు. రూ.35 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 1.50 లక్ష కోట్లకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును కమీషనేశ్వర ప్రాజెక్టుగా మార్చారని ధ్వజమెత్తారు.   

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ పార్టీని మారడంపై భట్టి విక్రమార్క ఆసక్తకర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు