ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ 

29 Jan, 2021 10:52 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో  2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది.  ఈ బడ్జెట్  కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ  తెలిపారు.

కరోనా సంక్షోభం, వాక్సినేషన్‌, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్‌ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న  దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్‌ బడ్జెట్‌లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే.  ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్,  లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన  నేపథ్యంలో  ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు