ఉమ్మడిగా వామపక్షాల పోటీ! 

22 Sep, 2023 03:20 IST|Sakshi

ఎంబీ భవన్‌లో జరిగిన భేటీలో సీపీఐ, సీపీఎం నేతల నిర్ణయం 

బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న కేసీఆర్‌: తమ్మినేని 

కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకోవడం లేదు: కూనంనేని 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల ఒకటో తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల ఉమ్మడి సమావేశం జరిగింది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్‌ కుమార్‌ తదితరులు ఈ భేటీలో పాల్గన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. 

బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్‌ ఆలోచనలు: తమ్మినేని వీరభద్రం 
కేంద్రంలో బీజేపీకి సహకరించే విధంగా బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేసీఆర్‌ ఇండియా కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా కొత్త ఫ్రంట్‌ తెరిచారని విమర్శించారు. కమ్యూనిస్టు పారీ్టలు బీజేపీ ఓటమి కోసమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగా పోటీచేస్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తోందని ఆరోపించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని, ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు తెచ్చారని విమర్శించారు. 

కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని, అయితే ఆ పార్టీతో పొత్తు వద్దనే ఆలోచన తమకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని.. సీట్ల పంపకంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మజ్లిస్‌తో కేసీఆర్‌కు మొదటి నుంచీ సఖ్యత ఉందని.. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో మజ్లిస్, కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందన్నారు. రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించ డం ఏమిటని నిలదీశారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చే కుట్ర ఇది అని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు