బక్కపల్చని వీరుడు బందూక్‌ అయ్యాడు: కేటీఆర్‌

30 Nov, 2022 01:15 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్‌ ‘దీక్షా దివస్‌’ సందడి 

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’నినాదంతో 2009 నవంబర్‌ 29న ఉద్యమనాయకుడిగా కె.చంద్రశేఖర్‌రావు చేసిన దీక్షకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘దీక్షా దివస్‌’పేరిట సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్‌ నేతల పోస్టులు సందడి చేశాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికలపై ‘దీక్షా దివస్‌’హ్యాష్‌టాగ్‌ ట్రెండింగ్‌గా నిలిచింది. ‘మీ పోరాటం అనితర సాధ్యం, ఒక నవశకానికి నాంది పలికినరోజు.

ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేల్కొల్పిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చేవిధంగా తెగించినరోజు. చరిత్రను మలుపుతిప్పిన 29 నవంబర్‌ 2009 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. కేసీఆర్‌ చరిత్రాత్మక దీక్షకు 12 ఏళ్లు. తెలంగాణ రాష్ట్రసాధనకు అలుపెరుగని పోరాటం చేసిన మన ఉద్యమనేత కేసీఆర్‌ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగి ఉక్కుసంకల్పాన్ని చాటి చెప్పినరోజు’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌ అరెస్టు, సిద్దిపేటలో తాను దీక్షకు కూర్చుకున్న ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.  

కేసీఆర్‌ దీక్షను గుర్తుచేస్తూ పోస్టులు 
కోట్లాదిమంది ప్రజలను ఏకతాటిపైకి నడిపి దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చిన నేత కేసీఆర్‌ అంటూ పలువురు రాష్ట్రమంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ‘దీక్షాదివస్‌’ను గుర్తు చేసుకుంటూ ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ ఫొటో­లను షేర్‌ చేశారు.

2009 నవంబర్‌ 29న సిద్దిపేటలో ఆమరణదీక్ష కోసం కరీంనగర్‌ నుంచి బయలుదేరిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను కరీంనగర్‌ జిల్లా అలుగునూరు వద్ద అరెస్ట్‌ చేసి తొలుత ఖమ్మం జైలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో 11 రోజులపాటు కేసీఆర్‌ దీక్ష కొనసాగగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్‌ 9న హామీ ఇవ్వడంతో కేసీఆర్‌ దీక్ష విరమించారు.   

మరిన్ని వార్తలు