Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి బెయిల్‌

3 Apr, 2023 15:41 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లోని సూరత్‌ సెషన్స్‌ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేశారు. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తనను దోషిగా తేల్చూతు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.  

అలాగే తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కూడా కొట్టివేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.  పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. రాహుల్ గాంధీ ఈ కేసులో  ఏప్రిల్‌ 13 వరకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అదే రోజు చేపడతామని చెప్పింది. దీంతో తీర్పుపై స్టే వస్తుందనుకున్న రాహుల్‌కు నిరాశే ఎదురైంది.

రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు తీర్పుపై స్టే విధిస్తే ఆయనపై ఎంపీగా అనర్హత వేటు తాత్కాలికంగా తొలగిపోనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. సూరత్‌ కోర్టకు రాహుల్‌ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు.

2019లో కర్ణాటకలో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో దొంగల ఇంటిపేరు మోదీ అనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై సూరత్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అనంతరం 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రెటేరియేట్‌ రాహుల్‌ గాంధీని ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ అనర్హత వేటు వేసింది. దీంతో దేశంలోని ప్రతిపక్షాలన్ని ఆయనకు సంఘీభావం తెలిపాయి.
చదవండి: కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి.. స్టేజీ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడ్డ నాయకులు..

మరిన్ని వార్తలు