అది ఫేక్‌ నివేదిక.. జైలుకు పంపేందుకు కేంద్రం కొత్త రూల్‌ ఇదే కదా: కేజ్రీవాల్‌

22 Jul, 2022 15:09 IST|Sakshi
అరవింద్ కేజ్రీవాల్‌

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్‌ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్‌ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 

2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్‌ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే  కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. 

రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్‌గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు.

'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి  కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ వేవ్‍ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోం‍దని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
చదవండి: 94 యూట్యూబ్‌ చానళ్లపై నిషేధం

మరిన్ని వార్తలు