ఎల్జీ తీరుపై ఆప్‌ అసహనం.. బీజేపీపై ఫైర్‌

25 Jul, 2021 08:06 IST|Sakshi

ఢిల్లీ: తమ పాలనలోని ప్రతీ నిర్ణయాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం నానాటికీ ఎక్కువ అవుతుండడంపై ఆప్‌ ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. తాజాగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వెల్లగక్కారు.

రైతు నిరసనల ఉద్యమ కేసుకు(జనవరి 26న జరిగిన పరిణామాల కేసు) సంబంధించి పోలీసుల తరపున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ గవర్నమెంట్‌ ఒక లాయర్ల ప్యానెల్‌ను ప్రతిపాదించింది. అయితే దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఎల్జీ.. మరో ప్యానెల్‌ను సూచించాడు. ఇక ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు ఘోర అవమానమేనని కేజ్రీవాల్‌ ఆక్షేపించారు. ‘కేంద్రంలో బీజేపీ పాలిస్తోంది. బీజేపీని చిత్తుగా ఓడించి ఢిల్లీలో మేం(ఆప్‌) పాలిస్తున్నాం. మేం ప్రజానిర్ణయంతో ఎంపికయ్యాం. అలాంటిది ప్రతీదాంట్లో బీజేపీ, ఆయన(ఎల్జీని ఉద్దేశించి) జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఇది ఢిల్లీ ప్రజల్ని అవమానించడమే అవుతుంది. బీజేపీ కొంచెం ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తే బాగుంటుంది’ అని హిందీలో శనివారం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశాడు. 

గత సోమవారం ఢిల్లీ కేబినెట్‌ ప్రతిపాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల పేర్లకు బదులు.. ఢిల్లీ పోలీసులు ఎంపిక చేసిన లాయర్ల ప్యానెల్‌ను ఎల్జీ అనిల్‌ బైజాల్‌ అప్రూవ్‌ చేయడం విశేషం. ఈ ప్యానెల్‌ నియామకం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే జరగడం మరో విశేషం. దీంతో డిప్యూటీ సీఎం సిసోడియా మండిపడ్డాడు. ‘అన్నీ వాళ్లే చేసుకుంటే.. ఇక మేమేందుకు?’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు