కేజ్రీవాల్ పార్టీకి షాకిచ్చిన ఢిల్లీ గవర్నర్‌.. రూ.97 కోట్లు కట్టాలని ఆదేశం..

20 Dec, 2022 14:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆప్ పార్టీ సొంత ప్రచారానికి చేసిన ఖర్చును చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.97 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారు.

ప్రభుత్వ ప్రకటనల నిబంధనలకు సంబంధించి 2016లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమ్ ఆద్మీ పార్టీ విస్మరించిందని వీకే సక్సెనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల పేరు మీద ఆప్ సొంత పార్టీ కోసం ప్రచారం చేసుకుందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ మొత్తాన్ని ఆప్ పార్టీనే చెల్లించాలన్నారు.

అయితే వీకే సక్సేనా ఆదేశాలపై ఆప్ ఘాటుగా స్పందించింది. అసలు గవర్నర్‌కు ఆ అధికారమే లేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం, జాతీయ పార్టీగా అవతరించడం చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటనల కోసం వేల కోట్లు ఖర్చు చేసిందని ఆప్ చెప్పింది. బీజేపీ మొత్తం రూ.22 వేల కోట్లను ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఖర్చు చేసిందని ఆరోపించింది. ఆ మొత్తాన్ని ఆ పార్టీ నుంచి వసూలు చేసిన తర్వాత తాము కూడా రూ.97 కోట్లు కచ్చితంగా చెల్లిస్తామని చెప్పుకొచ్చింది.
చదవండి: Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు..

మరిన్ని వార్తలు