అది జైలు కాదు దర్బార్.. సత్యేందర్ జైన్ మరో వీడియో లీక్‌..

26 Nov, 2022 13:40 IST|Sakshi

న్యూఢిల్లీ: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 12 నాటి ఈ వీడియోలో రాత్రి 8 గంటల సమయంలో సత్యేందర్ జైన్ సహచర ఖైదీలతో సమావేశమయ్యారు. అనంతరం  అప్పటి తిహార్ జైలు సూపరింటెండెంట్ వచ్చి ఆయనను కలిశారు.

ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ జై ట్వీట్ చేసి సైటర్లు వేశారు. సత్యేందర్ జైన్‌కు సంబంధించిన మరో వీడియో చూడండి. ఈసారి ఆయన దర్బార్‌లో  జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. జైలులో ఉంటూనే ‍అత్యాచార నిందితుడితో మసాజ్ చేయించుకున్నాడు. పసందైన విందు చేశాడు. ఇప్పుడు జైలు గదిలోనే సమావేశాలు. ఇది ఆప్ అవినీతి థెరపీ. కానీ కేజ్రీవాల్ దీన్ని సమర్థిస్తారు. ఇప్పటికైనా సత్యేంజర్ జైన్‌పై ఆయన చర్యలు తీసుకుంటారా? అని షెహ్‌జాద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలోని జైలు సూపరింటెండెంట్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవలే వైరల్ అయింది. అయితే ఫిజియో థెరపీ అని ఆప్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మసాజ్ చేసింది అత్యాచార కేసు నిందితుడు అని తర్వాత తెలిసింది. అనంతరం సత్యేంజర్ జైన్ జైలులో పసందైన విందు ఆరగించిన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఇప్పుడు మరో వీడియోను రిలీజ్ చేసి ఆప్‌పై విమర్శలు గుప్పించింది.
చదవండి: ముంబై ఉగ్రదాడులకు 14 ఏళ్లు.. ట్వీట్‌తో జైశంకర్ నివాళులు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు