మమత వ్యాఖ్యలపై మౌనమేల బాబు? 

20 Mar, 2022 04:09 IST|Sakshi

దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి 

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పెగసస్‌ స్పైవేర్‌ను వినియోగించడం ద్వారా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తమ నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసి తమను ఇబ్బందులకు గురిచేయడానికి గతంలో చంద్రబాబు ప్రయత్నించారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చెప్పారు. చంద్రబాబు కుట్రను బయటపెట్టిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువునష్టం దావా వేస్తామనిగానీ, ఆమె అవాస్తవాలు చెప్పారనిగానీ చంద్రబాబు, లోకేశ్‌ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.

శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెగసస్‌ స్పైవేర్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల మొబైల్‌ ఫోన్లలో వారికి తెలియకుండా వారి కదలికలను, గోప్యతలను తెలుసుకోవడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పెగసస్‌  స్పైవేర్‌ను చంద్రబాబు వినియోగించడంపై ప్రధాని మోదీని కలిసి వివరిస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపే వరకూ పోరాడతామన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించిన తండ్రీ కొడుకులు కటకటాలు లెక్కించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

పెగసస్‌ను కొనుగోలు చేయడానికి అప్పటి ప్రభుత్వ అధికారులను ఇజ్రాయెల్‌కు పంపడం, చంద్రబాబు పలు దఫాలు ఇజ్రాయెల్‌కు వెళ్లడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో తన ఫోన్‌ ఎందుకు ట్యాప్‌ చేశారని ప్రశ్నించిన చంద్రబాబు దీనికి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో చంద్రబాబు పీఏకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను ఎందుకు సేకరించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తండ్రీ కొడుకులిద్దరూ హైదరాబాద్‌లో కూర్చుని రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా సేకరిస్తున్నారని ఆరోపించారు.    

మరిన్ని వార్తలు