‘తప్పు చేస్తే ఆలస్యం అయినా శిక్ష పడవాల్సిందే’

10 Sep, 2023 20:33 IST|Sakshi

చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌తో న్యాయం, ధర్మం గెలిచినట్లయ్యింది

న్యాయస్థానం మీద ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది

ఇది ఆరంభం మాత్రమే,  ఇంకా వేల కోట్ల అవినీతి చరిత్ర చంద్రబాబుది

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా ):  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించిన అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ..  ‘న్యాయస్థానం మీద ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ అధికారంలో కొనసాగాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈరోజు రిమాండ్ కు పంపడం జరిగింది.  

తప్పు చేస్తే ఆలస్యం అయినా శిక్ష పడవాల్సిందే అని ఈరోజు నిరూపితం అయింది. ఇది ఆరంభం మాత్రమే, చంద్రబాబుకి సంబంధించి ఇంకా వేల కోట్ల కుంభకోణాలు బయట పడాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. ప్రభుత్వానికి చంద్రబాబు మీద ఎటువంటి వ్యతిరేక భావం లేదు. ప్రతీకారం తీర్చుకోవలన్న ఆకాంక్ష, ఆలోచన లేవు. ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడానికి ఒక ఉదాహరణ మాత్రమే’ అని అన్నారు కొట్టు సత్యనారాయణ.

మరిన్ని వార్తలు