పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా సవాల్‌

20 Aug, 2022 21:12 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: చంద్రబాబు దత్తపుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదని, కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వచ్చారంటూ పవన్‌ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కులాలు, మతాలు లేవు అందరూ ఒకటే అన్న విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా మాట్లాడుతూ.. రైతు విత్తనం మొదలు గిట్టు బాటు ధర వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ప్రశ్నించడానికి వచ్చిన పవన్‌ కళ్యాణ్ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు అత్మహత్యలు చేసుకున్నా, నీళ్ళు లేకపోయినా ఎందుకు ఆ రోజు ప్రశ్నించ లేదు. ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్. ప్యాకేజీ కుదిరాక ఏదో పర్యటన చేసి విమర్శిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టి, మద్యం ఏరులై పారినపుడు.. పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది. ఇది తెలియక పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని అన్నారు. 

చదవండి: (బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు)

ఖబడ్దార్‌ పవన్‌ కల్యాణ్‌
వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడని చెబుతున్నారు ఇది సరైంది కాదు. కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని పార్టీ పెట్టి, ప్రజాబలంతో అధికారంలోకి వస్తే వారసత్వ రాజకీయాలు అనడం ఏమిటి. నువ్వు ఏం రాజకీయాలు చేస్తున్నావు.. అన్న పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నావు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ. మా ప్రభుత్వంలో కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తలకు కూడా మంచి చేస్తున్నారు. నువ్వు, చంద్రబాబు కలిసి వైసీపీకి కులం, మతం అంట గడుతున్నారు. షర్మిల ఎప్పుడైనా జగన్ అన్యాయం చేసారని చెప్పారా. కానీ మీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఖబడ్దార్.. పవన్‌ కల్యాణ్‌ అంటూ హెచ్చరించారు.

చదవండి: (మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు)

సవాల్‌కు సిద్ధమా?
ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తున్నావు. నీకు ఒక హిడెన్ అజెండా ఉంది. చంద్రబాబుకు గంప గుత్తగా నీ కులం ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మాభిమానం అని మోసపు మాటలు వద్దు.  వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశాకే రాయలసీమకు నీళ్ళు వస్తున్నాయి. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాం.. నిరూపించేందుకు సిద్ధమా అంటూ అని పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలు