అంచనాలు పెంచి అవినీతి

18 Feb, 2024 03:43 IST|Sakshi

బీఆర్‌ఎస్‌పై భట్టి విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ల అంచనాలు పెంచారని చెప్పారు.

కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇంది రా సాగర్‌ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్‌ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు