Deputy CM: కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు: బూడి ముత్యాలనాయుడు

18 Apr, 2022 17:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే పెన్షన్‌ ఇస్తుంటే.. కొన్ని పత్రికలు ఐదో తేదీన ఇస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 'పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే బాధ కలిగి మాట్లాడుతున్నా. ఎన్నికల ముందు జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పెంచుతామని చెప్పారు. కానీ జనం నమ్మలేదు. జగన్ కూడా ఒకేసారి పెంచుతామని చెప్పలేదు దశల వారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి అలాగే పెంచుతున్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ కోసం నాలుగు వందల కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.1,570 కోట్లు ఇస్తోంది.

చంద్రబాబు, రామోజీరావుకు సీఎం జగన్‌ పాలన చూసి కడుపు మండి తప్పుడు వార్తలు రాస్తున్నారు. టీడీపీ హయాంలో ఈ పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదు. అర్హతలే ప్రామాణికంగా వాలంటీరు, సచివాలయం వ్యవస్థ పని చేస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జగన్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. లంచం ఇస్తే టీడీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా.. అర్హులకు మాత్రమే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. 

చదవండి: (పప్పులో కాలేసిన పవన్‌ కళ్యాణ్‌!)

పాలన విషయంలో సీఎంను విమర్శించే అర్హత, హక్కు ప్రతిపక్షాలకు లేదు. రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని ప్రతిపక్షం, కొన్ని పచ్చ పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం అమలు ఆగదు. ఇప్పటికే సీఎం జగన్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించారు. రేషన్ కోసం, పెన్షన్ కోసం అరుగుల మీద కూర్చొనే స్థితి నుంచి ఇంటి వద్దకే అందించే వ్యవస్థ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కల్పించారు' అని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

మరిన్ని వార్తలు