జనసేన కాదు.. టీడీపీకి తందానా

22 Oct, 2022 09:02 IST|Sakshi

∙ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే మరో సింహగర్జన 

డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

వీరఘట్టం: ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన టీడీపీ నేత చంద్రబాబునాయుడుతో పవన్‌ కళ్యాణ్‌ జతకట్టడంతో జనసేన పార్టీ.. కాస్త టీడీపీ తందానసేనగా మారిపోయిందని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం వండవ గ్రామంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశంగా ఉన్న విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకుంటే మరో సింహగర్జన తప్పదని హెచ్చరించారు.  

చంద్రబాబు పెద్ద దొంగ అంటూ 2018లో పవన్‌కళ్యాణ్‌ అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో లక్ష ఎకరాలు దోచుకున్నది చంద్రబాబేనని, విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని, అమరావతిలో రాజధాని దండగ అంటూ ఆ నాడు పేర్కొన్న పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు మాట మార్చి దొంగనాయకుడితో చేతులు కలపడం సిగ్గుచేటన్నారు.  చంద్రబాబునాయుడు కాళ్ల దగ్గర కూర్చునేవాడిని నాయకుడిగా ఎలా భావిస్తారని, జనసేన కార్యకర్తలు, నాయకులు  ఓసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దానిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ప్యాకేజీ స్టార్‌ను, చంద్రబాబునాయుడుని రాష్ట్రం నుంచి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు