మహిళలు మా సైలెంట్‌ ఓటర్లు

12 Nov, 2020 04:14 IST|Sakshi
ఢిల్లీలో జరిగిన బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని మోదీని గజమాలతో సత్కరిస్తున్న అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్, నితిన్‌ గడ్కరీ..

బీజేపీ విజయాల్లో వారిది కీలక పాత్ర

21వ శతాబ్ది రాజకీయాలకు అభివృద్ధే ప్రాతిపదిక

విజయోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ

హత్యారాజకీయాలు పని చేయవంటూ పరోక్షంగా మమతకు చురకలు

కుటుంబపార్టీగా మారిందంటూ కాంగ్రెస్‌ను ఎండగట్టిన ప్రధాని

న్యూఢిల్లీ: 21వ శతాబ్ది రాజకీయాల ఏకైక ప్రాతిపదిక అభివృద్ధేనని తాజా బిహార్‌ ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ విజయాల వెనుక సైలెంట్‌ ఓటర్లుగా ఉన్న మహిళల పాత్ర మరవలేనిదన్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మోదీ ప్రసంగించారు. బిహార్‌లో ఎన్డీయే విజయానికి తమ ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌’ నినాదమే కారణమని మోదీ పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా బీజేపీని ఎదుర్కోలేక తమ పార్టీ కార్యకర్తలను హతమార్చే కుతంత్రాలకు కొందరు దిగుతున్నారని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమత బెనర్జీపై పరోక్ష ఆరోపణలు గుప్పించారు. ‘బీజేపీ కార్యకర్తలను హతమార్చి తమ లక్ష్యాలను సాధించగలమని కొందరు అనుకుంటూ ఉంటారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. గెలుపు, ఓటములు సహజం. కానీ ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు మంచివి కాదు. ఈ హత్యా క్రీడ ఓట్లు రాల్చదు’ అని వ్యాఖ్యానించారు. 2021లో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడాన్ని బీజేపీ తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది.

నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిత్వంలో బిహార్‌ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలా సహకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలు విస్తరించాయని, దేశ ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద ముప్పు అని ప్రధాని తెలిపారు. ఓ జాతీయ పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లో చిక్కుకుపోయిందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దేశ సేవ చేయాలనుకునే యువత బీజేపీలో చేరాలని ప్రధాని కోరారు. మహిళలు, దళితులు, పేదలు, ఇతర అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని వివరించారు. ‘రెండు గదులు, రెండు సీట్ల’ స్థాయి నుంచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి బీజేపీ ఎదిగిందని మోదీ గుర్తు చేశారు.

దేశాభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని దీనితో స్పష్టమవుతోందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని వారు ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిపై పోరాడే విషయంలో బీజేపీ సుపరిపాలనను ప్రజలు గమనించారన్నారు. బిహార్‌లో గెలుపును ప్రస్తావిస్తూ.. అధికారంలో ఉండి కూడా వరుసగా మూడుసార్లు సీట్ల సంఖ్యను పెంచుకున్న ఏకైక పార్టీ బీజేపీయేనని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో కూడా అధికారంలో ఉండి, మంచి విజయాలు సాధించామన్నారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమికి మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేశారన్న విశ్లేషకుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..  బీజేపీ విజయంలో మహిళల పాత్ర గణనీయంగా ఉందన్నారు.  బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రధాని మోదీ ఘనతేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.  

బిహార్‌ ప్రజలకు సెల్యూట్‌: నితీశ్‌
పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు విజయం అందించిన బిహార్‌ ప్రజలకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ‘సెల్యూట్‌’ చేశారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్డీయేకు మెజారిటీ అందించిన ప్రజలకు నా సెల్యూట్‌. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని నితీశ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.   

హాజరైన పార్టీ శ్రేణులు

మరిన్ని వార్తలు