థాక్రే పని అయిపోయింది.. మహారాష్ట్రలో బీజేపీ నెం.1.. ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

20 Sep, 2022 16:53 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది.

ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్‌ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న  షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు.

అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది.

అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్‌ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు.
చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!

మరిన్ని వార్తలు