సొంతపార్టీ వాళ్లకే చెమటలు పట్టించిన ఉమా! మాకొద్దు బాబోయ్‌ అంటున్న తమ్ముళ్లు

30 Jan, 2023 21:04 IST|Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా: తెలుగుదేశం పార్టీలో జనం నెత్తిన చేతులు పెట్టే నేతలకు కరువేమీ లేదు. అదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి..సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. ఇప్పుడాయన పేరు చెబితే పార్టీలోను, మైలవరం నియోజకవర్గంలోనూ అందరూ మండిపడుతున్నారట. నోటి దురుసు, అహంభావానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేవినేని వ్యవహారంతో కార్యకర్తలు ఎప్పట్నుంచో విసిగిపోయి ఉన్నారట.

ఇటీవల ఉమా తీరు మరింత వరస్ట్‌గా మారడంతో క్యాడర్ కు అస్సలు రుచించడం లేదని టాక్. దీంతో అతనికి వ్యతిరేకంగా మైలవరంలో గ్రూపులు మొదలయ్యాయట. దేవినేని ఉమా తాజాగా వెలగబెట్టిన నిర్వాకం కారణంగా సైకిల్ పార్టీ శ్రేణులు ఉమా అంటే ఆమడ దూరంలో ఉంటున్నారట. గొల్లపూడి వన్ సెంటర్ లో ఆలూరి చిన్నారావుకు చెందిన స్థలంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఆ స్థలం ఆలూరి చిన్నారావుకు అతని తల్లి శేషారత్నం గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు. ఆ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తన ఆస్థిని కాపాడుకునేందుకు శేషారత్నం జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించారు. ఏడాది పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు కలెక్టర్ గిఫ్ట్ డీడ్ రద్దుచేసి ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. 

ఆలూరి శేషారత్నం

ఆ స్థలంపై కన్నేశారు
కలెక్టర్ ఆదేశాలతో శేషారత్నంకు స్థలం అప్పగించేందుకు అధికారులు అక్కడకు వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో దేవినేని ఉమా జోక్యం చేసుకుని కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారని టాక్. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పేరిట ఆ స్థలాన్ని పర్మినెంట్ గా కొట్టేయాలనేది దేవినేని ఉమా ప్లాన్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే దేవినేని ఉమా ఓ రేంజ్ లో డ్రామా నడిపించాడు.

కానీ అతని బెదిరింపులకు వెరవకుండా శేషారత్నం ధైర్యంగా నిలబడ్డారు. తల్లీ కొడుకుల మధ్య ఉమా చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా వ్యూహం ఫలించలేదట. దీంతో అధికారులు ఎట్టకేలకు ఆ స్థలాన్ని ఆమెకు ఇప్పించడంతో పాటు అక్కడున్న టీడీపీ కార్యాలయాన్ని కూడా తరలించారు. ఐతే పార్టీ కార్యాలయం ముసుగులో శేషారత్నం స్థలం కొట్టేయాలన్న దేవినేని ప్లాన్ దారుణంగా ఫెయిలవ్వడంతో పాటు పార్టీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందట.

పార్టీ కార్యకర్తకే వెన్నుపోటా?
శేషారత్నం కుటుంబం అంతా టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వివాదానికి కారణమైన స్థలానికి నెలకు లక్షరూపాయలు అద్దె వస్తుందని తెలిసినా పార్టీ కోసమే అయాచితంగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేవినేని పన్నాగం తెలుసుకుని స్థలాన్ని కాపాడుకునేందుకు శేషారత్నం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది.

సొంత పార్టీకి చెందిన వారి స్థలాన్నే కబ్జా చేయాలని దేవినేని ఉమా వేసిన ప్లాన్ సక్సెస్ కాకపోగా...రచ్చ రచ్చగా మారి పచ్చ పార్టీ అభాసుపాలైందట. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందట. అసలే మైలవరం టీడీపీలో లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తున్న సమయంలో ఈ పంచాయతీ ఏంటంటూ మండిపడుతున్నారట చినబాబు, చంద్రబాబు. ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్న మైలవరం తమ్ముళ్లంతా..అదే అదనుగా కట్టకట్టుకుని ఉమాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేశారట. ఈసారి ఉమా మాకొద్దంటున్నాం కాబట్టి... ఈసారి ఆ సీటేదో మాకే ఇచ్చేయండి బాబు అంటూ అధినేత ముందు క్యూ కట్టేస్తున్నారట. 

మాకొద్దు బాబు.. మీకో దండం
మైలవరం నుంచి దేవినేని ఉమాను బయటికి పంపించేయాలనుకుంటున్న బొమ్మసాని సుబ్బారావు, జంపాల సీత రామయ్య, కాజా రాజ్ కుమార్, జువ్వ రాంబాబు తదితర ఆశావాహులంతా  హై కమాండ్ వద్ద ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటి నుంచి గమనిస్తున్న క్యాడర్ మాత్రం 2024లో ఉమాకు మైలవరం టిక్కెట్టు ఇస్తే పార్టీ మూసేసుకోవడం ఖాయమని బాహాటంగానే చర్చించుకుంటున్నారట.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు