మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ 

9 Apr, 2021 04:00 IST|Sakshi

తిరుపతి ఓటర్లను మభ్యపెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే కుట్ర 

అసలు ఆడియో, వీడియోలతో పొంతనలేని మార్ఫింగ్‌ వీడియో  

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అసలు వీడియో 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాటలను వక్రీకరిస్తూ మార్ఫింగ్‌ వీడియోతో తిరుపతి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పన్నిన కుట్ర బూమరాంగ్‌ అయింది. ఆయన దురుద్దేశాలను పటాపంచలు చేస్తూ ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ అసలు వాస్తవాలను నిగ్గుతేల్చి గురువారం వాటిని వెల్లడించింది. ఆ వివరాలు.. ‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మార్ఫింగ్‌ వీడియోతో ఉమా బుధవారం ట్వీట్‌ చేశారు.

ఫ్యాక్ట్‌ చెక్‌ టీమ్‌ రంగంలోకి దిగి ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో వేర్వేరు సందర్భాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్‌ చేసి ఉమా ట్వీట్‌ చేశారని నిర్ధారించింది. మార్ఫింగ్‌ వీడియోకు ఆడియో కూడా సరిపోకపోవడంతో ఇది ఉద్దేశపూర్వంగా చేసినదేనని పేర్కొంది. 2014 ఏప్రిల్‌ 13న వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోను, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలోను సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మీడియా సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్‌ చేసి వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్లు తేలింది.

వాస్తవానికి ఆయా మీడియా సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోనున్న చర్యలు, వైద్య ఆరోగ్య విభాగంలో ఎక్కడైనా సరే మౌలిక వసతులు ఏర్పాటుచేయకుండా వైద్య నిపుణులు తిరుపతి, ఒడిశా, బిహార్‌లో ఉండటానికి ఇష్టపడరనే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. ఆయా వీడియోలను ఉమా ‘స్మార్ట్‌ ఎడిటర్‌’తో మార్ఫింగ్‌ చేశారని, వాటిలోని దృశ్యానికి ఆడియో అనుసంధానం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఫ్యాక్ట్‌ చెక్‌ తేల్చింది. ఈ తేడాలను అందరూ గమనించేలా ఒరిజినల్‌ ఆడియోతో ఉన్న ఒరిజినల్‌ వీడియోను, ఉమా మార్ఫింగ్‌ వీడియో క్లిప్‌లను కూడా  ఊ్చఛ్టిఇజ్ఛిఛిజు.అ్క.ఎౌఠి.జీn  వెబ్‌సైట్‌లో ఉంచారు. తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడానికి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉమా మార్ఫింగ్‌ వీడియోతో చేసిన ట్వీట్‌పై చట్టపరమైన చర్యలకు ఫ్యాక్ట్‌ చెక్‌ తగిన ఆధారాలతో సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు