పెగసస్‌ మీ నిర్వాకమేనా ?

29 Jul, 2021 06:33 IST|Sakshi

సొంతవారిపైనే నిఘా ఆయుధమా!

కేంద్రానికి రాహుల్‌ గాంధీ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: ‘మాది ఒకే ఒక్క ప్రశ్న. పెగసస్‌ను కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందా?
కేంద్రమే తన సొంత మనుషులపై (సొంత పౌరులపై) పెగసస్‌ ఆయుధాన్ని ప్రయోగించిందా?  
అవునా, కాదా? దీనికి సమాధానం కావాలి’ అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు విపక్ష పార్టీలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయని, ఆ చర్చ జరిగే వరకు మరే ఇతర అంశాన్ని ప్రస్తావించమని కచ్చితంగా చెప్పారు. ఈ అంశంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్‌ సహా 14 పార్టీలకు చెందిన నాయకులు బుధవారం సమావేశమై చర్చలు జరిపారు. ఈ అంశంపై ప్రధాని మోదీ లేదంటే హోం అమిత్‌ షా సమక్షంలో పార్లమెంటులో చర్చ జరగాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. ఈ సమావేశానికి టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ హాజరు కాలేదు. సమావేశానంతరం విజయ్‌చౌక్‌లో ఇతర పార్టీ నేతల సమక్షంలో రాహుల్‌ మాట్లాడారు.   

అది దేశద్రోహమే
పెగసస్‌ స్పైవేర్‌ వ్యవహారాన్ని వ్యక్తిగత గోప్యత అంశంగా తాను చూడడం లేదని, దీనిని దేశద్రోహంగా చూడాలని రాహుల్‌ అన్నారు. భారతదేశంపైనా, దేశ ప్రజలపైనా పెగసస్‌ అనే ఆయుధాన్ని ప్రధాని వాడారని ఆరోపించారు. ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాలని ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యమే ఆందోళనలో పడేలా కేంద్రం వ్యవహరిస్తోందని, అందుకే దీనిపై చర్చ జరగాల్సిందేనని డీఎంకే నేత టి.ఆర్‌. బాలు అన్నారు. కాగా, పెగసస్‌ స్పైవేర్, రైతు సమస్యల అంశంలో విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంటు పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎదురు దాడికి దిగింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు