పాలమూరి చేతికి షాక్‌లు..చిన్నారెడ్డి రూటు ఎటు?

16 Jan, 2023 16:50 IST|Sakshi

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్ నేత మీదే తిరుగుబాటు మొదలైంది. సీనియర్ స్వార్థపూరిత వ్యవహారాల్ని ఇంక సహించేది లేదంటూ గాంధీభవన్‌కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఒక్కసారిగా పార్టీలో అసమ్మతి రేగడంతో హైదరాబాద్ నాయకత్వం కూడా దిక్కులు చూస్తున్నట్లు సమాచారం. 

చిన్నారెడ్డి రూటు ఎటు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం ఓటర్లు విలక్షణ తీర్పును ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి గెలిచిన ప్రతినాయకుడు ఆయాపార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో  నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. మాజీమంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా  గెలిచారు. ఐదోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమి తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవటం లేదని స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చిన్నారెడ్డి ప్రచారం చేసుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదు. 

ఈ ఎన్నిక లాస్ట్‌..!
జిల్లా పార్టీకి నూతన అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ నియామకం పెద్దదుమారమే రేపింది. జడ్పీటీసీగాను.. రాష్ట్ర బీసీ సెల్‌లో పదవి అనుభవిస్తున్న వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వనపర్తిలో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో హాత్‌సే హాత్‌ జోడో అభియాన్‌ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. అసమ్మతి నేతలు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్‌లో సమావేశం కావటం కలకలం రేపింది. చిన్నారెడ్డి హాటావో...కాంగ్రేస్‌కు బజావో అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే పార్టీ ఓడిపోతుందని.. ఆయనకు వ్యతిరేకంగా తామంతా పనిచేస్తామని అసమ్మతినేతలు హెచ్చరించటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే చివరిసారి అని చెప్పటం చిన్నారెడ్డికి అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి వాదులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసి చిన్నారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకే సీటిస్తే సహకరించేదని కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. గాంధీభవన్‌ వద్ద నిరసన తెలిపిన నేతలు దిగ్విజయ్ సింగ్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

కొత్త చేతులకు ఎప్పుడు అవకాశం?
వచ్చే ఎన్నికల్లో కొత్తవారికి టికెట్ ఇవ్వాలని వనపర్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సీనియర్లు.. రేవంత్‌వర్గం అంటూ రచ్చకెక్కి అధిష్టానానికి తలనొప్పి తెప్పించారు. తాజాగా వనపర్తిలో ఇలాంటి ఘటనలు జరగటం హాట్‌ టాపిక్‌గా మారింది. తనకు వ్యతిరేకంగా గ్రూపులు కూడగడుతున్నట్టు ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు యువజన కాంగ్రెస రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వీరిద్దరి మద్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్‌ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీద పడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 

మరోనేత నాగం తిరపతిరెడ్డి సైతం పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాని చిన్నారెడ్డి మాత్రం తాను పోటీకి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి పార్టీ గెలుస్తుందే ధీమాను కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‌రెడ్డిని ఎదుర్కొవటం అంతా సులువు కాదని భావిస్తున్న పార్టీ నేతలకు తాజా విభేదాలు తలనొప్పిగా మారాయంటున్నారు. 
-పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు