భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో టికెట్ల గుబులు.. ఆజ్యం పోసిన చంద్రబాబు

11 Aug, 2022 07:45 IST|Sakshi

తెలుగుదేశం పార్టీలో అంతా గందరగోళం

నంద్యాల నేతల మధ్య ముదిరిన విభేదాలు  

సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు 

కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామన్న చంద్రబాబు  

అంతర్మథనంలో భూమా, కోట్ల, కేఈ కుటుంబాలు 

పార్టీ కార్యక్రమాలకు దూరంగా కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్‌ 

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న టీడీపీ శ్రేణులు

తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒక ప్రాంతంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటే మరో ప్రాంతంలో నేతలు నైరాశ్యంలో మునిగి తేలుతున్నారు. టీడీపీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.  

సాక్షి, కర్నూలు: నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని టీడీపీ నేతల్లో నిస్తేజం నెలకొంది. కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అంతర్గత కలహాలను ప్రోత్సహించడంపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌ కుమారుడు ఫిరోజ్‌ మధ్య సోషల్‌ మీడియా వేదికగా వర్గపోరు నడుస్తోంది. ‘ఫిరోజ్‌ యువసేన’ పేరుతో సోషల్‌ మీడియాలో బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. 

అసంతృప్తులకు ఆజ్యం పోసిన చంద్రబాబు.. 
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామని నేతల అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. దీంతో టీడీపీలో కీలకంగా ఉండే భూమా, కోట్ల, కేఈ కుటుంబాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్‌ భూమా అఖిలప్రియకు ఇస్తే, ఆ కుటుంబానికి రెండో అవకాశం ఇవ్వబోరని, నంద్యాలలో తాను రేసులో ఉండొచ్చని ఫిరోజ్‌ భావించారు. దీంతో ఇటీవల చురుగ్గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా బ్రహ్మానందరెడ్డిపై విమర్శలు చేయిస్తున్నారు. భూమా వైఖరితోనే నంద్యాలలో టీడీపీకి ఈ దుస్థితి దాపురించిందని ప్రచారం చేయిస్తున్నారు. గత మునిసిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయించారు. భూమా వర్గీయులు సైతం ఫిరోజ్‌ వర్గానికి వ్యతిరేకంగా కౌంటర్‌ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ క్లస్టర్‌ మీటింగ్‌లో వేదికపైనే తనను సమావేశానికి ఆహ్వానించలేదని బ్రహ్మానందరెడ్డిపై ఫిరోజ్‌ అసంతృప్తి వెలిబుచ్చారు. దీనికి స్పందించిన భూమా.. టీడీపీలో విభేదాలు సృష్టించాలని ఎవరు ప్రయత్నించినా ఎదుర్కొంటానన్నారు.

ఎమ్మెల్సీ ఫరూక్‌ కనుసన్నల్లోనే ఫిరోజ్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కూడా ఇటీవల ఓ సందర్భంలో ‘‘పాలు అమ్ముకునేవారిని చంద్రబాబు ఎమ్మెల్యేను చేశారని’’ భూమా బ్రహ్మానందరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ‘భూమా’కు వ్యతిరేకంగా ఫరూక్‌ ఫ్యామిలీకి బీసీ సహకరిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉండగా దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి సైతం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెబుతున్నారు. ముగ్గురు నేతల మధ్య విభేదాలు పెరిగిపోవడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉండలేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.  

కేఈ, కోట్ల కుటుంబాల్లోనూ టిక్కెట్ల గుబులు  
టీడీపీ ఆవిర్భావం నుంచి భూమా, కేఈ కుటుంబాలు జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరించాయి. భూమా కుటుంబం టీడీపీ వీడిన తర్వాత కేఈ కుటుంబ పెత్తనం నడిచింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీని వీడి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పచ్చ కండువా వేసుకున్నారు. ఆపై భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు టీడీపీలో కీలకంగా ఉన్నాయి. కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మూడు కుటుంబాల్లోనే గుబులు రేపుతున్నాయి.

మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో ముగ్గురు నేతలు ఉన్నారు. కుమారుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కేఈ సోదరుడు కేఈ ప్రతాప్‌ 2019లో డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. బేతంచెర్ల మునిసిపల్‌ ఎన్నికల సమయంలో కేఈ ప్రతాప్‌ని తప్పించి ధర్మవరం సుబ్బారెడ్డికి డోన్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్‌కు నియోజకవర్గం లేదు. దీంతో ఈయన ఆలూరు టిక్కెట్‌ కోసం యత్నిస్తున్నారు.

ఆలూరు దక్కకపోతే కర్నూలు నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామంటే కోట్ల సుజాతమ్మతో పాటు కేఈ ప్రభాకర్‌కు కూడా టిక్కెట్‌ దక్కదు. దీంతో వీరంతా టీడీపీపై గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉండగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంపీ టిక్కెట్‌ కాదని, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జయనాగేశ్వరరెడ్డి ఉన్నారు. కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చిన పార్టీని కాదని కోట్ల సుజాతమ్మ బయటకు రాలేరు. అయిష్టంగానైనా ఆమె టీడీపీలో కొనసాగనున్నారు. అయితే కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్‌ మాత్రం టీడీపీ వీడి బయటకు రావాలనే యోచనలో ఉన్నారు.

పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఏడాది కిందట టీడీపీకి తాను రాజీనామా చేశానని కూడా కేఈ ప్రభాకర్‌ ప్రకటించారు. ఆపై అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా కర్నూలు, నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు కొందరు సరైన రాజకీయ ఫ్లాట్‌ఫాం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో ఉన్నారు. నేతల వర్గపోరు, అసంతృప్తుల మధ్య నలగలేక  కార్యకర్తలు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు