ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్‌ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు

21 Sep, 2022 19:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు కేరళ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోత్ మధ్యే పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా.. రేసులో నేనూ ఉన్నా అని కీలక వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్.  ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని ఓ జాతీయ ఛానల్‌తో ఇంటర్వ్యూలో అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే అశోక్ గహ్లేత్ కచ్చితంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్‌లో పార్టీ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. తాను  ఒక్కటే కాదు.. మూడు పదవులనూ కూడా సమర్థంగా నిర్వహించగలనని అశోక్ గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎ‍న్నికైనా రాజస్థాన్ సీఎంగా కొనసాగుతానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. దిగ్విజయ్ దీనిపైనే స్పందిస్తూ ఒక్కరికి ఒకే పదవి అని తేల్చి చెప్పారు.

అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేసారు. పీవీ నరసింహా రావు, సీతారం కేసరి పేర్లను ప్రస్తావించారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్‌ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు