మహిళలపై ఆర్‌ఎస్‌ఎస్, తాలిబన్‌ అభిప్రాయం ఒక్కటే!

12 Sep, 2021 04:32 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌

భోపాల్‌: ఉద్యోగాలు చేసే మహిళల విషయంలో మన దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌), అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ల అభిప్రాయం ఒక్కటేనని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్, తాలిబన్లు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోనంత వరకూ ఇదే నిజమని భావించాల్సి వస్తుందని చెప్పారు.

2013లో మోహన్‌ భగవత్‌ మాట్లాడినట్లు చెబుతున్న ఓ వీడియోను దిగ్విజయ్‌ ప్రస్తావించారు. పెళ్లి అనేది ఒక కాంట్రాక్టు, పెళ్లయిన మహిళలు ఇళ్లల్లోనే ఉండాలి, ఇంటి పనులు చూసుకోవాలి అని మోహన్‌ భగవత్‌ అన్నారని గుర్తుచేశారు. అఫ్గాన్‌ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని తాలిబన్లు తేల్చిచెబుతున్నారని వెల్లడించారు. దిగ్విజయ్‌ ట్వీట్‌ను మధ్యప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు వి.డి.శర్మ తప్పుపట్టారు. దిగ్విజయ్‌తోపాటు కాంగ్రెస్‌ నాయకత్వం తాలిబన్ల మద్దతుదారులని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు