రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్‌లో ఉత్కంఠ

29 Jul, 2022 02:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒకౖ­వెపు ఆయన పార్టీని విడిచి వెళ్లకుండా అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది అనుచరులు కూడా పార్టీని వీడొద్దని చెబుతు­న్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. అయితే ఆయన పార్టీ మారడానికే నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన పార్టీ మారడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తథ్యమని తెలుస్తోంది.

దిగ్విజయ్‌ ఫోన్‌
పార్టీ వీడే అంశంపై నియోజకవర్గ అనుచ­రగణంతో రాజగోపాల్‌రెడ్డి వరుస సమావే­శాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా.. పార్టీ వీడొద్దని కొంతమంది అను­చ­రులు చెప్పినట్లు తెలిసింది. ఆయన మాత్రం నాలుగైదేళ్లుగా పార్టీ నాయకత్వం ఏ విధంగా అవమానించిందన్న విషయాన్నే వివ­రించినట్లు సమాచారం. కాగా బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో భేటీ అయిన రాష్ట్ర నేతలు.. రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తద్వా­రా అధిష్టానం బుజ్జగింపులకు ప్రయత్నిస్తుందనే సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ గురువారం రాజగోపాల్‌­రెడ్డికి ఫోన్‌ చేయడం హైకమాండ్‌ ఆలోచ­నను స్పష్టం చేసింది. పార్టీ మారవద్దని సూచించడంతో పాటు ఏదైనా ఉంటే రెండురోజుల తర్వాత ఢిల్లీకి రావాల్సిందిగా దిగ్విజయ్‌ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 

రేపు రాజగోపాల్‌తో భేటీ!
మరోవైపు ఉదయం ఢిల్లీలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై రెండు గంటల పాటు చర్చించారు. ఆయన పార్టీలోనే ఉండేలా చూడాలని అధిష్టానం వీరికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా శనివారం సాయంత్రం రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 

ఒత్తిడి పెంచుతున్న బీజేపీ!
మరోవైపు పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వైపు నుంచి రాజగోపాల్‌పై ఒత్తిడి పెరిగి నట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, శుక్రవారం బండి సంజయ్, ఈటల, కిషన్‌రెడ్డి తదితర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని  వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన్ను ఎలాగైనా ఢిల్లీ తీసుకెళ్లాలని సంజయ్, ఈటల తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ క్యాడర్‌లో ఉత్కంఠ
అధిష్టానం బుజ్జగింపులతో రాజగోపాల్‌ రెడ్డి శాంతిస్తారా? పార్టీని వీడే విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతారా? అనే విషయమై కాంగ్రెస్‌ క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి తాజా పరిణామాలకు ముందే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజాగా అధిష్టానం రంగంలోకి దిగడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. శనివారం నాటి సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అధిష్టానం బుజ్జగింపులు, అనుచరుల అభిప్రాయంతో రాజగోపాల్‌రెడ్డి కొంత సందిగ్ధంలో పడినా, ఏఐసీసీ దూతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా.. బీజేపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

మరిన్ని వార్తలు