‘యాత్రలతోనే ప్రజలకు చేరువ’

2 Aug, 2020 17:51 IST|Sakshi

 యువనేతలు వర్సెస్‌ సీనియర్లు

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ గాంధీ తిరిగి పార్టీపగ్గాలు చేపట్టాలని సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ నేతలు కోరారు. రాహుల్‌ కుటుంబ నేపథ్యంపై వీడియోతో ఆయనను పార్టీ సారథిగా చూడాలనుకుంటున్నామని నేతలు పేర్కొన్నారు. రాహుల్‌ పునరాగమనంపై పార్టీ నేతల డిమాండ్‌ నేపథ్యంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన సూచనలు దుమారం రేపాయి. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని దిగ్విజయ్‌ సింగ్‌ సూచించారు. రాజకీయాలను భిన్నంగా నడపాలనే రాహుల్‌ అవగాహనను తాను అర్ధం చేసుకోగలనని, శరద్‌ పవార్‌ సూచించిన విధంగా ఆయన దేశమంతా చుట్టిరావాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు కీలకమని డిగ్గీరాజా ట్వీట్‌ చేశారు.

ఇక దిగ్విజయ్‌ సింగ్‌ సూచనలపై యువ నేతలు భగ్గుమన్నారు. రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు వందసార్లు కాలినడక యాత్రలు చేశారని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో పార్టీ విప్‌ మాణిక్యం ఠాగూర్‌ గుర్తుచేశారు. పార్టీలో ఉన్నతస్ధాయిలో ఉన్న నేతలు రాహుల్‌కు అండగా నిలవాలని, వెనుకనుంచి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. రాహుల్‌ పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టాలని కోరుతున్న యువనేతలంతా పార్టీ పతనానికి సీనియర్‌ నేతలే కారణమని మండిపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణకు దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు కమల్‌నాథ్‌లు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సింథియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలడానికి సీనియర్‌ నేతల నిర్వాకమే కారణమని యువనేతలు నిందిస్తున్నారు. రాజస్తాన్‌లో సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు కూడా పార్టీలో యువనేతల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొంటున్నారు.

కాగా, గురువారం జరిగిన పార్టీ అంతర్గత భేటీలోనూ కాంగ్రెస్‌ సీనియర్‌, యువ నేతల విభేదాలకు వేదికగా నిలిచింది. కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను సొమ్ము చేసుకోవడంలో విపక్షంగా విఫలమయ్యామని దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీనియర్లు పేర్కొన్నారు. ఈ అంశాలపై రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో బీజేపీపై సమర్ధంగా పోరాడుతున్నారని సీనియర్ల విమర్శలను యువనేతలు తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులు కార్యకర్తలను ఎందుకు విస్మరించారని, మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ ఎందుకు పతనమైందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ భేటీలో 45 ఏళ్ల రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ సతవ్‌ పేర్కొన్నారు. చదవండి : ‘ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమే’

మరిన్ని వార్తలు