జోష్‌ ఇంకా పెరగాలి

31 Aug, 2021 01:57 IST|Sakshi
కుసుమకుమార్, ఉత్తమ్‌లను సన్మానిస్తున్న కాంగ్రెస్‌ నేతలు. చిత్రంలో అజారుద్దీన్, మధుయాష్కీ, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మాణిక్యం ఠాగూర్, భట్టివిక్రమార్క

పడిపోతున్న టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ .. బీజేపీలో వర్గపోరు తీవ్రం 

కాంగ్రెస్‌ కేడర్‌లో రెండు నెలలుగా ఉత్సాహం 

వాతావరణం మనకే అనుకూలం..

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత గత రెండు నెలల కాలంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహంతో కూడిన కదలిక కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ నేతల అవినీతిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ నానాటికీ పడిపోతోంది. ఇంకోవైపు బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. పాదయాత్రల కోసం ఆ పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు.

ఈ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితు ల్లో ఈ ఊపు, ఉత్సాహం మరింత పెరగాలి’అని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అభి  ప్రాయపడింది. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూ ర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్‌లతో పాటు ప్రస్తుత వర్కింగ్‌ ప్రెసిడెంట్లు హాజరయ్యారు.  

17లోపు హుజూరాబాద్‌ అభ్యర్థి ప్రకటన 
మాణిక్యం ఠాగూర్‌ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన కీలక నేతలందరూ హుజూరాబాద్‌ అభ్య ర్థిగా ఒక్క పేరునే సూచిస్తే ఆ పేరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఓకే చేయిస్తానని చెప్పారు.  పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, పరిశీలించిన దరఖాస్తులను అధిష్టానానికి పంపి వచ్చేనెల 17లోపు అభ్యర్థిని ప్రకటించాలని తీర్మానించారు.  

మరో రెండుచోట్ల దండోరా సభలు 
దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు మం చి స్పందన వచ్చిందని, క్షేత్రస్థాయి కార్యక్రమాల వల్ల దళితులు, గిరిజనుల్లో అవగాహన పెంచగలిగామని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17లోగా మరో రెండుచోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో గజ్వేల్‌ లేదా మెదక్‌ పార్లమెంటు స్థానం పరిధిలోనికి వచ్చే మరోచోట సభ నిర్వహించాలని తీర్మానించారు. 17న నిర్వహించే ముగింపుసభకు రాహుల్‌ రాకపోతే ఏఐసీసీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు.  

దళితబంధుతో వ్యతిరేకత 
దళితబంధు వల్ల దళితుల్లోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత వస్తోందని సీనియర్‌ నేతలు చెప్పారు. ఈ నేపథ్యం లో దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాలకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేతలే తమ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పినట్టు సమాచారం.

పార్లమెంటు స్థానాల వారీ సమీక్షా సమావేశాలు డిసెంబర్‌ 31 కల్లా పూర్తి చేస్తానని మాణిక్యం ఠాగూర్‌ చెప్పారు. అప్పటికి మండల స్థాయి, బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళతానని రేవంత్‌ అన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేత కె.జానారెడ్డి గైర్హాజరయ్యారు. కాగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జెట్టి కుసుమకుమార్‌లు పార్టీకి చేసిన సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది.   

‘ఆ లోటు కనిపించింది’ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్‌ నాయకులు కొందరు లేని లోటు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్‌ లాంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా ఉందని మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ అన్నా రు. గతంలో వైఎస్సార్‌ సీఎం హోదాలో ఉన్న ప్పుడు కూడా కాకా, వీహెచ్‌లాంటి నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారని, సభలు సక్సెస్‌ చేయడం ఎంత ముఖ్యమో సీనియర్‌ నేతలను గాంధీభవన్‌కు రప్పించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పీసీసీ గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు