కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్‌.. ఈసారి టికెట్‌ ఆయనకేనా?

18 Nov, 2022 19:00 IST|Sakshi

ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? 

కాల్వ కేరాఫ్‌ రామోజీ క్యాంపస్‌ 
కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కాల్వకు జేసీబీతో బ్రేక్‌
చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్‌కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్‌) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్‌కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. 

కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.!
కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. 

కిం కర్తవ్యం.?
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్‌. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు